4 May, 2026 | 7:55 PM

రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

04-05-2026 06:26 PM

రోజు కనీసం 5-6 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసి మిల్లులకు తరలించండి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో ఎప్పుడైనా ఎక్కడైనా అకస్మాత్తుగా వర్షాలు పడే ప్రమాదం ఉంటుందని, అందువల్ల వడ్లు తడిచిపోకుండా, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోలు పై   రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహచర మంత్రులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి,  సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి జిల్లా కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ... అకాల వర్షాలకు వరి తడిచిపోయి రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని వరి  కొనుగోలు పై రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సూచించారు. అకాల వర్షాలు ఎప్పుడైనా ఎక్కడైనా పడవచ్చని వర్షాలకు వడగండ్ల వానకు వరి తడిసిపోయి రైతులు నష్టపోవడానికి మీరు లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యతలు కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు.

 గత రెండు సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చాలా విజయవంతంగా జరిగిందని ఈసారి సైతం ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేసి రైతులు నష్టపోకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ వడ్లు ప్రతి రోజు  కొనుగోలు కేంద్రానికి  ఎన్ని వడ్లు వచ్చాయి, కొనుగోలు చేసిన వడ్లు ఎంత, మిగిలి ఉన్న వడ్లు ఎంత, మిల్లుకు తరలించిన వడ్లు ఎంత అనే వివరాలు రోజువారిగా నివేదిక ఇవ్వాలనీ పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు.

ప్రస్తుతం అకాల వర్షాల వల్ల ఎక్కడైనా సరే అకస్మాత్తుగా నిమిషాల వ్యవధిలోనే వడగండ్ల వర్షం పడే ప్రమాదం ఉన్నందున రైతులు నష్టపోకుండా అవసరమైనన్ని టార్పాలిన్లు కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. వడ్లు కొనుగోలు లో వేగం పెంచాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన రైతులు ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. 

కొనుగోలు చేసిన వడ్లు ఎప్పటికప్పుడు లారీల్లో మిల్లులకు తరలించాలని మిల్లుల వద్ద అన్లోడింగ్ కు ఎక్కువ సమయము ఇవ్వకుండా త్వరగా అన్లోడింగ్ అయ్యే విధంగా ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు తాము చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అన్ని లారీలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వడ్లు కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో నమోదు ఎప్పటికప్పుడు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలని డి.సి. ఒ, డి.ఆర్.డి. ఒ అధికారులను ఆదేశించారు. ఈ సీజన్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సీరియస్ గా తీసుకొని సకాలంలో కొనుగోలు చేసి రైతులకు డబ్బులు అందే విధంగా చూడాలని ఆదేశించారు.