23 June, 2026 | 3:25 AM

జూలై 5న ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం

14-06-2024 12:05 AM

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డులను అందచేయను న్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు మీలా జయదేవ్ తెలిపారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 107 ఏళ్ల నుంచి తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) విజయవంతంగా పనిచేస్తోందని తెలిపారు. 1974 నుంచి తాము ఎక్సలెన్స్ అవార్డులు అందిస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో నిపుణులను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.

నాణ్యమైన ఉత్పత్తులు, అత్భుతమైన అభివృద్ధికి పేరుగాంచిన కంపెనీలను గుర్తించి, రాష్ట్ర ప్రగతి దోహదపడేవారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎగుమతులు, మార్కెటింగ్, ఇన్నోవే షన్, ఆర్‌అండ్‌డి టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంప్లాయీ వెల్ఫేర్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, టూరిజం ప్రమోషన్, సైంటిస్ట్/ఇంజినీర్, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగులు, సామాజిక భాగస్వామ్య వ్యక్తులు, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, బెస్ట్ స్టార్టప్ వంటి 21 అంశాల్లో అవార్డులను ఇస్తున్నట్లు జయ రాం వెల్లడించారు. జూలై 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజేతలకు అవార్డులను అందిస్తారని తెలిపారు.

www.ftcci.in లేదా www.ftcciawards.in ద్వారా ఈ నెల 20 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు నామమాత్రపు ఫీజు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. జస్టిస్ చల్లా కోదండ రామ్, ఎం గోపాల్ కృష్ణ, ఐఏఎస్, అజయ్ మిశ్రా, ఐఏఎస్, ఐఐటీ హైదరాబాద్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉదయ్ బి దేశాయ్, ఎలికో ఎండీ వనిత దాట్లతో కూడిన జ్యూరీ ఎంట్రీలను పరిశీలించి విజేతలను నిర్ణయిస్తుందని మీలా జయరాం వెల్లడించారు. ఎఫ్‌టిసిసిఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింఘాల్, అవార్డ్స్ కమిటీ ఛైర్మన్ కరుణేంద్ర జాస్తి, కో చైర్మన్ రమాకాంత్ ఇనాని తదితరులు పాల్గొన్నారు.