23 June, 2026 | 2:11 AM

ఆసియా పసిఫిక్‌లో ఇండియాదే వృద్ధి జోరు

14-06-2024 12:05 AM
  • మూడీస్ రేటింగ్స్

న్యూఢిల్లీ, జూన్ 13: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇండియా వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని అంతర్జా తీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రకటించింది. దేశీయ వినియోగ డిమాండ్‌పై ఆధారపడి భారత్ వృద్ధి పరుగు కొనసాగిస్తున్నదని ఆసియాపసిఫిక్ క్రెడిట్ అవుట్‌లుక్ పేరుతో మూడీస్ రేటింగ్స్ విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. 2024 ప్రధమార్థంలో ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, ఇండియాలు నేతృత్వం వహించాయని, ఎగుమతులు పెంచుకోవడం ద్వారా కొవిడ్ ముందస్తు వృద్ధి అంకెల్ని అధిగమిస్తాయని మూడీస్ వివరించింది.

మౌలిక రంగంపై ప్రభుత్వ పెట్టుబడులు, స్థానిక డిమాండ్ వృద్ధికి తోడ్పాటు అందిస్తాయన్నది. లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రభుత్వ విధానాలు కొనసాగుతాయని, మౌలిక అభివృద్ధిపై దృష్ఠి యథాప్రకారం ఉంటుందని, ప్రైవేటు రంగ పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించింది. కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు పటిష్ఠం గా కావడం, విలువలు ఆకర్షణీయంగా  ఉండటంతో భారత్‌లోకి పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేసింది. ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని, 2025లో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని గత నెలలో మూడీస్ విడుదల చేసిన అంచనాల్లో పేర్కొంది.