18-02-2026 02:17:50 PM
విశాఖపట్నం: విశాఖలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష ముగిసింది. విశాఖపట్నం సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026(International Fleet Review 2026) కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భారత నావికాదళం దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉందని, విస్తృత సముద్ర వాణిజ్యంలో స్థిరత్వానికి దోహదపడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పేర్కొన్నారు. భారత నావికదళం ఎంతో సమర్థంగా పనిచేస్తోందని కొనియాడారు.
బంగాళాఖాతంలో భారత నావికాదళ యుద్ధనౌకలో వైజాగ్ తీరంలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (International Naval Review)కు అధ్యక్షత వహించిన రాష్ట్రపతి, సముద్రంలో తలెత్తే ముప్పులు, సవాళ్లకు వ్యతిరేకంగా రక్షణకు విశ్వసనీయ సాధనంగా పనిచేయడానికి భారత నావికాదళం ఈ ప్రాంతంలో మోహరించబడిందన్నారు. ఐఎన్ఎస్-సుమేధ నౌకపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ప్రయాణించారు. ఆరు వరసల్లో 71 యుద్ధనౌకల పరేడ్ నిర్వహించారు. ఫ్లీట్ రివ్యూలో ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు 45 యుద్ధనౌకలు పాల్గొన్నాయి. యుద్ధనౌకల పరేడ్ ను రాష్ట్రపతి తిలకించారు. ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాల మధ్య ఐక్యత, పరస్పర సహకారాన్ని చాటిందని రాష్ట్రపతి కొనియాడారు.