BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం
జబరి రవీందర్
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు చేపట్టిన ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు అప్రజాస్వామిక చర్యలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు, గుండి గ్రామ సర్పంచ్ జబరి రవీందర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్న సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వినిపించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం నిరాకరిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని అన్నారు. ప్రశ్నించిన వారిపై అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం సరికాదని, ప్రజా గొంతుకను అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. కుమురంభీం ఆశయాల స్ఫూర్తితో ప్రజా హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.అక్రమంగా అరెస్టు చేసిన బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని కోరారు. అరెస్టయిన వారిలో ఉపసర్పంచ్ సంతోష్, వార్డు సభ్యుడు రాజు, బీజేపీ నాయకులు సుంకరి పెంటు తదితరులు ఉన్నట్లు తెలిపారు.






