ఆకాశన్నంటుతున్న ‘ఇటుక’ ధరలు
ఇందిరమ్మ ఇండ్ల రాకతో అమాంతంగా పెరిగిన ధరలు
పల్లెల్లో 2వేల ఇటుక రూ.18వేల నుంచి 22వేల వరకు విక్రయాలు
పట్టణాల్లో రూ.20వేల నుంచి 25వేల వరకు విక్రయాలు
ఇళ్లు కట్టే పేదలకు భారంగా మారిన ధరలు
అర్థిక ఇబ్బందులు పడుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు
ధరల నియంత్రణ కరువు.. పట్టించుకుని అధికారులు
కూసుమంచి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఇటుక ధరలు అకాశానంటుతున్నాయి.. ప్రజల అవసరాలను అసరాగా చేసుకున్న ఇటుక వ్యాపారులు ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు.. క్రీస్తూ శకం.. క్రీస్తూ పూర్వం అన్నట్లుగా ఇందిరమ్మ ఇళ్లు రాక ముందు... ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన తరువాత అన్నట్లుగా బట్టీ వ్యాపారులు ధరలను కొండేక్కించారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు ఆ ధరలు పెరిగిపోయాయి.. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన తరువాత ఇటుక ధరలు మూడు రెట్లు పెరిగినట్లు ప్రజలు చెబుతున్నారు. దీంతో ఇండ్లు కట్టుకోవాలనుకునే నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు బెంబెలేత్తుతున్నారు. ఇటుక ధరల పై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.
ప్రతి ఇళ్లు నిర్మాణం చేయాలంటే ఇటుక చాలా అవసరం.. అందులో ఎర్ర ఇటుక లేకుండా ఏ ఇళ్లు కట్టలేము.. ఆ ఇటుకతో ఇళ్లు నిర్మాణం చేస్తేనే గట్టిదనం ఉంటుందని అందరు భావిస్తుంటారు. అయితే ఏ సైజు ఇళ్లు నిర్మాణం చేయాలన్న కనీసం 10వేల ఇటుక అవసరం అవుతుంది.. సింగిల్ బెడ్ రూమ్ కు సుమారు 10వేలు, డబుల్ బెడ్ రూమ్ ఇంటికి 15వేల నుంచి 20వేల ఇటుక అవసరం. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు ఎర్ర ఇటుకతో ఇళ్లు నిర్మాణం చేయాలని భావిస్తారు. అందుకే ఇంటి నిర్మాణం చేసేవారు ముందుగా ఇటుక ను కొనుగోలు చేసేందుకు తొందరపడతారు.
ట్రక్కు రూ.20వేలకు పైగా ధరలు
ఎర్ర ఇటుక ధరలు ఏడాదికేడాది అమాంతంగా పెరుగుతున్నాయి.. 2005 సంవత్సరంలో 2వేల ఇటుక ధర రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ధర పలికేది. 2010 తరువాత రూ.4వేల నుంచి రూ.5వేలకు పలికేది. 2015 నుంచి 2024 వరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాకముందు ట్రక్కు ఎర్ర ఇటుక రూ.5వేల నుంచి రూ.7వేల వరకు ధరలుండేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం, గ్రామానికి 20 నుంచి 30 ఇండ్లను మంజూరు చేయడంతో లబ్ధిదారులందరికి ఇటుక అవసరమైంది.
దీంతో లబ్ధిదారుల అవసరాన్ని అసరగా చేసుకున్న ఇటుక బట్టీల వ్యాపారులు ఇటుక ధరలను అమాంతంగా పెంచేశారు. 2024 డిసెంబర్ వరకు మంచి ఇటుక ట్రక్కు ఇటుక రూ.10వేలకు పెంచిన వ్యాపారులు, నెల వ్యవధిలోనే రూ.15వేలు, మరో నెలకు మరో రూ.5వేలను పెంచి ప్రస్తుతం 2వేల ఇటుక ధర రూ.20వేల నుంచి రూ.25వేల వరకు విక్రయిస్తున్నారు. రెండవ రకం ఇటుక 2వేల ఇటుక రూ.16వేల నుంచి రూ.18వేల వరకు విక్రయాలు చేస్తున్నారు.
పేదలకు భారమవుతున్న ఇటుక ధరలు
ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసే నిరుపేదలకు ఇటుక ధరలు భారమవుతున్నాయి. ఒకోక్క ఇందిరమ్మ ఇంటికి చిన్ని ఇంటికి సుమారుగా 10వేల ఇటుక, కొంచె పెద్ద ఇంటికి 15వేల ఇటుక అవసరం అవుతుంది. దీంతో ఇటుకకే రూ.1,50,000 నుంచి రూ రూ.1,80,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.. దీంతో నిరుపేదలకు ఇటుక అధిక ధరలు తీవ్రంగా భారమవుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరల నియంత్రణ ఏది..?
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగానే సిమెంట్, ఐరెన్, ఇసుక ధరలను అమాంతంగా పెంచారని భావించి తక్షణమే ధరల నియంత్రణపై ఉపమంత్రివర్గాన్ని నియమించింది. రోజుల వ్యవధిలోనే ధరలను నియంత్రించింది. దీంతో సిమెంట్, ఐరెన్, ఇసుక ధరలు అదుపులోకి వచ్చాయి.
కానీ ఇటుక ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప..ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. ఇటుక ధరలను పట్టించుకునే నాథుడే కరువైయ్యారు. అధికారులు ఇటుక బట్టీల వైపు చూసే నాథుడే లేడు. దీంతో ఇటుక వ్యాపారులు అధిక ధరల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతుంది.. ప్రజలకు మాత్రం జేబులకు చిల్లు పడుతోంది..
కూసుమంచిలో మరింతగా పెరిగిన ధరలు
కూసుమంచి మండలంలోని కూసుమంచి, తుర్కగూడెం, జుజ్జులరావుపేట సమీప గ్రామాల్లో ఇటుక బట్టీలు ఉన్నాయి. ఈ ఇటుక బట్టీలలో ధరలు విఫరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఇటుక ధరలను వ్యాపారులు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.
మండల కేంద్రానికి అతి దగ్గరలో ఇటుక బట్టీలు ఉన్నప్పటికి సంబంధిత రెవెన్యూ, పర్యావరణ, పంచాయతీ రాజ్, చిల్డన్స్ వ్పెర్ అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. కనీసం ధరల నియంత్రణ పై ద్రుష్టి సారించడం లేదు. దీంతో తీవ్ర స్థాయిలో విమ్మర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇటుక బట్టీలను తనిఖీ చేసి వ్యాపారులతో చర్చించి, ధరలను నియంత్రించాలని, నిరుపేదలకు సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా..? ఇటుక బట్టీలను తనిఖీ చేస్తారా..? చూద్దాం..




