08-01-2026 01:29:36 AM
అర్చక జేఏసీ పిలుపు
కొమరవెల్లి, జనవరి 7: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న అర్చక ఉద్యోగ జేఏసీ సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వీరశైవ అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి మహాదేవుని మల్లికార్జున్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి క్షేత్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు.
ఈ సమావేశంలో అర్చక ఉద్యోగుల సమస్యలపై చర్చించి, పరిష్కారం కోసం తగిన కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అర్చక ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ అర్చక ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అర్చకులు చిన్న మల్లికార్జున్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.