కంటైనర్‌లో ఊపిరాడక 15 ఎద్దులు మృతి
సూర్యాపేట, మే 29 (విజయక్రాంతి): వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా కంటైనర్‌లో మూగజీవాలు తరలిస్తున్నారు. ఆ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులేవంటే..? జీవాలు తరలిస్తున్న వ్యక్తులు నీళ్లునమిలారు. అనుమతుల విషయంలో వ్యాపారులు, పోలీసులకు మధ్య సెటిల్‌మెంట్ కుదరలేదు. దీంతో రాత్రంతా జీవాలు వాహనంలోనే ఉండిపోయాయి. తెల్లారేసరికి ఊపిరాడక 15 జీవాలు మృతిచెందాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో వెలుగు చూసింది. తెలిసిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన నట్‌రాజ్, స్వామి అనే వ్యక్తులు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా గురజాలలో 26 ఎద్దులు కొనుగోలు చేశారు.
వాటిని కంటైనర్‌లో తమిళనాడుకు తరలిస్తున్నారు. వాహనం మఠంపల్లి చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకుని అనుమతులు అడిగారు. ఎద్దులు కొన్న యజమానుల వద్ద అధికారిక అనుమతులు లేకపోవడంతో పోలీసులు వారితో బేరాలు మొదలుపెట్టారు. అది ఎంతకీ తెగకపోవడంతో రాత్రి 8 గంటలకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో రాత్రంతా కంటైనర్ తెరవలేదు. బుధవారం కంటైనర్ తెరిచి చూడగా 15 ఎద్దులు మృతిచెందాయి. మరో రెండు ఎద్దుల కాళ్లు విరిగిపోయాయి. పోలీసులు మిగిలిన జీవాలను నల్లగొండలోని గోశాలకు తరలించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే మూగజీవాలు మృతిచెందాయని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎద్దుల మృతిపై ఎస్పీ రాహుల్ హెగ్డే విచారణకు ఆదేశించారు.






