నేటి నుంచి ప్రధాని మోదీ ఇజ్రాయెల్ టూర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౨౪: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగానే బుధవారం ఆయన ఇజ్రాయెల్‌కు బయల్దేరి టెల్ అవీవ్ చేరుకోనున్నారు. ముందుగా మోదీ ఆ దేశపు పార్లమెంట్ (నెస్సెట్)లో ప్రసంగించనున్నారు. తర్వాత ఇరు దేశాధినేతలు భేటీ అయి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించనున్నారు.
ప్రధానంగా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, రక్షణ రంగంలో సహకారం వంటి అంశాలపై చర్చ జరుగనుంది. ఇరు దేశాల మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అనంతరం మోదీ జెరూసలెంలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.




