ఉదయ్‌భాను చిబు అరెస్ట్
- ‘ఏఐ సమ్మిట్’ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన కేసులో కీలక మలుపు
- యూత్ కాంగ్రెస్ చీఫ్‌పై పలు సెక్షన్లపై కేసులు నమోదు
- ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు కేసు అప్పగింత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౨౪: ఢిల్లీలోని భారత్ మండప్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఇటీవల కాంగ్రెస్ నేతలు చేసిన అర్ధనగ్న ప్రదర్శనకు ఆ పార్టీ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌భాను చిబు బాధ్యుడని భావించిన ఢిల్లీ పోలీసులు మంగళవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతడిని దాదాపు 20 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాతే అరెస్ట్ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉదయ్‌భాను అరెస్ట్‌తోఈ కేసులో అరెస్టున వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారని దర్యాప్తు అధికారులు కోర్టుకు వివరించారు.
ఈ కేసు విచారణను ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఇతర రాష్ట్రాల సమన్వయంతో అంతర్రాష్ట్ర సెల్ అధికారులు కేసు దర్యాప్తు చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మిగిలిన ఏడుగురు నిందితులతో కలిపి ఉదయ్‌భానును విచారించనున్నారు. నిరసనలో వాడిన టీషర్టుల తయారీకి నిధులు ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో సోదాలు చేస్తున్నారు.




