16 July, 2026 | 1:19 PM

213 మంది ఖైదీలు విడుదల

03-07-2024 09:30 PM

హైదరాబాద్ : చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు బుధవారం విడుదలయ్యారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల చేసేందుకు సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఇటీవల గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఖైదీలను చర్లపల్లి జైలుకు తీసుకొచ్చి ఇవాళ చర్లపల్లి కారాగారం ప్రాంగణంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆధ్వర్యంలో ఖైదీలు విడుదల కార్యక్రమం నిర్వహించారు.

విడుదలవుతున్న ఖైదీలకు పలు రకాల ఉపాధి కల్పించి విడుదల చేశారు. ఖైదీల కోసం వచ్చిన కుటుంబసభ్యులతో చర్లపల్లి జైలు ఆవరణలో కోలాహలం నెలకొంది. ఖైదీలను షరతులతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఖైదీ బయటకు వెళ్లిన తర్వాత సత్ప్రవర్తన కలిగి ఉంటానని, లేదంటే తిరిగి శిక్ష అనుభవిస్తానని రూ. 50 వేల పూచికత్తుతో బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. గత శిక్షకాలం పూర్తయ్యేవరకు వారి గ్రామ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లలో ప్రతి మూడు నెలలకు ఒకసారి హాజరు కావాలని షరతులు విధిస్తూ ఖైదీలను విడుదల చేశారు.