4 April, 2026 | 9:35 AM

మొక్కలను పీకేసిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం

14-10-2025 12:30 AM

పర్యావరణానికి తూట్లు రోడ్డుపై మట్టి నింపడంతో ఇబ్బందులు నిద్రావస్థలో అధికారులు

అమీన్పూర్, అక్టోబర్ 13 : మొక్కలు పెంచండి.. పర్యావరణాన్ని కాపాడండి అంటూ అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే కొందరు తమ స్వార్థం కోసం నాటిన మొక్కలను పెకిలించి వేస్తున్నారు. తాజాగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని  కిష్టారెడ్డిపేట - మాదారం వెళ్ళే ప్రధాన రహదారి వడక్పల్లి వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.

అయితే పాఠశాల పూర్తిగా రోడ్డుకు సమీపంలో ఉండడం, గత ప్రభుత్వంలోనే ఈ రహదారిపై వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను తొలగించి మట్టితో చదును చేశారు. పాఠశాల ముందు ఉన్న మొక్కలను పరిరక్షించా ల్సిన పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా, తమనెవరు ఏమీ చేయలేరన్న ధీమాతో పెద్దవి మూడు, చిన్నవి మూడు మొక్కలను పీకివేసి మట్టితో రోడ్డు వరకు చదును చేశారు. అసలు ఆ మొక్కలను తొలగించాల్సిన అవసరమే లేకున్నా తమకు అడ్డంగిగా ఉండొద్దన్న ఉద్దేశ్యంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వ లక్ష్యం.. పట్టించుకోని  అధికారులు

ప్రతియేటా ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. చెట్లను పరిరక్షించాల్సిన మున్సిపల్, రెవన్యూ, పంచాయతీ అధికారులు నిద్రావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఓవైపు దర్జాగా ప్రైవేట్ పాఠశాల మొక్కలను పీకివేస్తుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల అనుమతి లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.  

మా దృష్టికి రాలేదు..

వడక్పల్లి ప్రైవేట్ స్కూల్ యాజమా న్యం మొక్కలను తొలగించినట్లు మా దృష్టికి రాలేదు. విచారణ చేయించి తగి న చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా మొక్కలు పీకేయడం నేరం.

 వెంకటేశ్, తహసీల్దార్, అమీన్పూర్