14-10-2025 01:21:10 AM
చేవెళ్ల/హైదరాబాద్, అక్టోబర్ 13(విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.కుటుంబ సభ్యులు లక్ష్మారెడ్డి భౌతిక కాయాన్ని బంధుమిత్రుల సందర్శనార్థం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ బీ కాలనీలో ఆయన స్వగృహంలో ఉంచారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు జూబిలీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా
కొండా లక్ష్మారెడ్డికి రాజకీయాల్లో గొప్ప నేపథ్యం ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డికి స్వయానా మనవడు. తన తాత ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించిన లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఏపీసీసీ ప్రతినిధిగా, గ్రీవెన్స్ సెల్ చైర్మన్‌గా సేవలు అందించారు. అంతేకాకుండా, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ క్రీడా మండలి చైర్మన్‌గా కూడా పనిచేశారు.
1999, 2014 ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేశారు. రాజకీయాలతో పాటు జర్నలిజం రంగంపైనా కొండా లక్ష్మారెడ్డికి ఎంతో ఆసక్తి ఉండేది. ఈ మక్కువతోనే ఆయన 1980లో ’ఎన్‌ఎస్‌ఎస్’ పేరుతో ఒక స్థానిక వార్తా సంస్థను ప్రారంభించారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించి జర్నలిజం వర్గాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గ సభ్యుడిగా లక్ష్మారెడ్డి సేవలందించారు. కొండా లక్ష్మారెడ్డి మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కే. శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్( టీయూడబ్ల్యూజే ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే విరాహత్ అలీ, రామ్ నారాయణ సంతాపం ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, ఎమ్మెల్యేగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన విశేష సేవలందించారని సీఎం కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీలో లక్ష్మారెడ్డి పలు హోదాల్లో పని చేశారని డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్ సెల్ అధికార ప్రతినిధిగా సేవలు అందించారన్నారు. లక్ష్మారెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీతో పాటు పాత్రికేయ రంగానికి తీరని లోటని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సానుభూతి తెలియజేశారు.
మీడియా సంస్థలకు తీరని లోటు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
మాజీ ఎమ్మెల్యే, ఎన్‌ఎస్‌ఎస్ వార్తా ఏజెన్సీ స్థాపకుడైనా కొండా లక్ష్మారెడ్డి మరణం తెలుగు ప్రజలకు, మీడియా సంస్థలకు తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు.ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ న్యూస్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి అనారోగ్యంతో మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. కొండా లక్ష్మారెడ్డి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.