అబద్ధాలను తిరస్కరించారు
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ
ఆరో విడత పోలింగ్‌లో ఓటు వేసిన రాహుల్
న్యూఢిలీ, మే 25: అబద్ధాలను, విద్వేషాలను, తప్పుడు ప్రచారాలను దేశ ప్రజలు తిప్పికొట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు వారి సమస్యల గురించే ఆలోచించారని వివరించారు. శనివారం ఆరో విడత పోలింగ్ నేపథ్యంలో సోనియా గాంధీతో కలసి న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లోని పోలింగ్ కే ంద్రంలో రాహుల్ తన ఓటేశారు. ఓటర్లు తమ హక్కులు, కుటుంబాల భవిష్యత్తు కోసం ఓటేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ‘తొలి ఐదు విడతల్లో దేశ ప్రజలు అబద్ధాలు, విద్వేషాలు, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టారు. వారి సమస్యల గురించే ఆలోచించి ఓటేశారు. మీరు వేసే ప్రతి ఓటు కూడా 30 లక్షల ప్రభుత్వా ఖాళీలను భర్తీ చేస్తుంది. తొలి ఉద్యోగ హక్కును కల్పిస్తుంది. ఏటా లక్ష రూపాయలు యువతకు అందిస్తుంది. మహిళలకు ప్రతి నెలా రూ.8,500 బ్యాంకు ఖాతాల్లో పడేలా చేస్తుంది’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఈ ఓటు మీ జీవితాన్ని మాత్రమే మార్చదు. దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతుంది’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.






