హలో.. హలో.. హలో..!
సెల్ సిగ్నల్ కోసం గుట్టలు, చెట్లు, పందిళ్ళు ఎక్కాల్సిందే..!
ఇంటర్నెట్ సౌకర్యం లేక ఈజీఎస్ కూలీల ఇబ్బందులు
ఆదిమ గిరిజన గ్రామాల్లో నేటికీ ప్రారంభంకానీ టవర్ల ఏర్పాటు
ఆదిలాబాద్/ఉట్నూర్, మార్చి ౫ (విజయక్రాంతి): మారుమూల ప్రాంతాలకు సమాచారం, ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పించేందు కు కేంద్ర ప్రభుత్వం పీఎం జెన్ మన్ యోజన పథకం తీసుకోచ్చింది. ఈ పథకం కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీవీటీజీ గ్రామాలను గుర్తించి సెల్ టవర్లు మంజూరు చేసింది. ఏజెన్సీ ప్రాంతం ఏర్పడినప్పటి నుండి సమాచార, ఇంటర్నెట్ సౌకర్యాలకు దూరంగా ఉన్న ఆదిమ గిరిజన తెగల గ్రామాల్లో ప్రజలు ఎంతో సంతోషపడ్డారు.
కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం జన్మన్ యోజన పథకం రెండేళ్లు పూర్తయిన నేటికీ పీ.వీ.టీ.జీ గూడ లకు సెల్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కలగలేదు. దీంతో ఆదిమ గిరిజనులు బయట ప్రపంచంలోని బంధువులకు, అధికారులకు, వైద్య సౌకర్యం కోసం 108 అంబులెన్స్ కు సమాచార అందించాలంటే సెల్ ఫోన్ కి సిగ్నల్ వచ్చే చోటుకు పరుగులు తీయవలసి వస్తుంది.
ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని అదిలాబాద్, కొమరం భీమ్ జిల్లాలోని మారు మూల గిరిజన గ్రామాలతో పాటు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గుమ్మెల, ఎల్లాపూ ర్, దొందరి తదితర కొలం గిరిజన గూడా ల కు సమాచార సౌకర్యం, ఇంటర్నెట్ సౌకర్యం నేటికీ లేదు.. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి, అదిలాబాద్ రూరల్ మండలం, ఉట్నూ ర్ , గాదిగూడ మండలాల పరిధిలోని మారుమూల గ్రామాలకు నేటికీ సమాచార.. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదు.
గుట్టలు, చెట్లు ఎక్కాల్సిందే...
ఇంద్రవెల్లి మండలంలోని సమాకా గ్రామ పంచాయతీ పరిధిలోని పాటగూడ, రాముగూడ, మరోతిగూడ తో పాటు పలు గూడలకు ఈ సౌకర్యం లేకపోవడంతో గూడ లకు రెండు కిలోమీటర్ల దూరంలోని గుట్ట పైకి, లేదా చెట్లను ఎక్కి 108 అంబులెన్స్ తో పాటు బయట వారికి ఫోన్ ద్వారా సమాచారాన్ని పంపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు తీసేందుకు, ఇంటి బిల్లులు అందించేందుకు లబ్ధిదారులతో పాటగూడ గుట్టను ఎక్కి తీసుకోవలసిన పరిస్థితి ఉంది.
ఈ గూడెం తో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల పం చాయతీ పరిధిలోని గ్రామాలతో పాటు అత్తిగుట్ట, అల్లికో రి, ఖానాపూర్, చిద్దరి తదితర పంచాయతీ పరిధిలోని గ్రామా ల్లో ఈ పరిస్థితి నెలకొంది.. నార్నూ ర్, గాదిగూడ, ఉట్నూర్, సిరికొండ, బజారత్నూర్ తదితర మండలాల పరిధిలోని మారుమూల గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొ ంది.
ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లోని 45 ఆదిమా తీగల గిరిజన గూడ లను గుర్తించి ఐటీడీఏ అధికారులు సెల్ టవర్లు నిర్మించాలని బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు నివేదికలు పంపి రెండేళ్లయిన నేటికీ టవర్ల ఏర్పాటు కనిపించడం లేదు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్, చిద్దరి, ఇంద్రవెల్లి మండలంలోని బుర్సన్ పటార్ గ్రామాల్లో సెల్ టవర్లు నిర్మించిన నేటికీ అవి పని చేయడం లేదు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఇంటర్‌నెట్ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతు న్నారు.
కూలీలు, సిబ్బందికి ఇబ్బందులు..
జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చునా వి.బి.జి రామజీ సవరణ చట్టంలో ఉపాధి కూలీలకు తిప్పలు తప్పడం లేదు. ఉపాధి హామీ పనులు చేసిన కూలీలు ఉదయం, సాయంత్రం ఉపాధి హామీ పథకంలో పని చేసే ఫీల్ అసిస్టెంట్ తో పాటు మెట్లు పని చేసిన చోట కూలీల ఫోటోలను తీయాల్సి వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో సాంకేతిక లోపం కారణంగా ఉపాధి హామీ పనులు చేసిన కూలీల చిత్రాలు తీయాలంటే ఫోన్ సాంకేతికాలతో పాటు ఆన్లైన్ సిగ్నల్ సైతం రావాలి.
జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్, సిరికొండ, బజారత్నూర్, ఇచ్చోడ, బేల తదితర మండలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామా ల్లో జాతీయ ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కూలీల ఫోటో క్యాప్చరింగ్ చేసి, అప్లోడ్ చేయవలసి ఉంది.కూలీల ఫోటోలు క్యాప్చరింగ్ చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లోడ్ చేయకుంటే ఆరోజుకు కూలీలకు వేతనాలు రానే రావు. ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీల చిత్రాలను ఫోటో క్యాప్చరింగ్ చేసినందుకు ఉపాధి హామీ పథకంలో పనిచేసే మెట్లతో పాటు ఫీల్ అసిస్టెం ట్లు వ్యవసాయ చైన్‌లలోని పందిళ్ళతో పాటు గుట్టలు, చెట్లు ఎక్కవలసిన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
ప్రతి మండలంలోని మారుమూల గ్రామంలో సాంకేతిక లోపం కారణంగా ఉపాధి హామీ పథకంలో రోజువా రి కూలీలుగా పనిచేస్తున్న వారికి సక్రమంగా కూలి వేతనాలు సైతం అందడం లేదని కూలీ లు వాపోతున్నారు.. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన గ్రామాల్లో దుస్థితిని పరిగణలోకి తీసుకొని ఫోటో క్యాప్చరింగ్ లేకుం డా ఉపాధి పనులు కల్పించి.. ఉపాధి పనుల కోసం వలస పోకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు.
ఇంటర్నెట్ ఏర్పాటుకు కృషి
ఆదిమ గిరిజన తెగల గ్రామాల్లో గిరిజనులకు సమాచారం కోసం ఇంటర్నెట్ అందేలా కృషి చేస్తాం. పీఎం జన్మన్ యోజనలో టవర్ల ఏర్పాటుకు బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు గ్రామాల వివరాలను పంపించాం.
అంబాజీ జాదవ్ డీడీ ఉట్నూర్, ఐ.టి.డి.ఏ.




