అమెరికాలో సెన్సార్ విధానమే వేరు!
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా(Director Sandeep Reddy Vanga) సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్‌రెడ్డి రూపొందిస్తున్నారు.
ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ప్రణయ్‌రెడ్డి(Producer Pranay Reddy) విలేకరులతో పంచుకున్న ఈ చిత్ర విశేషాలివీ.. “గతంలో కొన్ని కథలు విన్నాం. అవి మా సెన్సబిలిటీస్‌కు దగ్గరగా లేవని వదిలేశాం. ఈ కథలో హ్యూమర్ ఉంది, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయి. డైరెక్టర్ వేణుగోపాల్ స్క్రిప్ట్ నెరేషన్ కూడా మమ్మల్ని ఆకట్టుకుంది. డైరెక్టర్లుగా సందీప్‌కు, వేణుగోపాల్‌కు నార్త్, సౌత్ పోల్స్ అంత డిఫరెన్స్ ఉంది. ఒక కామన్ గ్రౌండ్‌లో వేణు చెప్పిన కథ మాకు బాగా నచ్చింది.
సుమంత్ ప్రభాస్ క్యారెక్టర్ నేపథ్యంగా సాగే సినిమా ఇది. ఇంజినీరింగ్ పూర్తిచేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు, అతని జీవితంలో ఏం జరిగింది, అతని ప్రేమకథ ఎలా సాగింది. వాళ్ల ఫ్రెండ్స్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి అనేదే సినిమా. అమెరికాలో సెన్సార్ అనేది ఇండస్ట్రీ వాళ్ల సారథ్యంలో నడుస్తుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. మన సంప్రదాయాలు, పద్ధతులు, మన ప్రజల నమ్మకాల నేపథ్యంలో మనకు సెన్సార్ రూల్స్ పెట్టారు. ప్రభుత్వ కోణంలో సెన్సార్ నిబంధనలు సరైనవే. ఆ రూల్స్ తెలిసుంటే ఫిలిం మేకర్స్ ముందే జాగ్రత్తపడతారు.
సెన్సార్ రూల్స్ కూడా తరుచూ అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం మరో రెండు కథలు విన్నాం. అవి ఇంకా పేపర్ మీద ఉన్నాయి. మా దృష్టి అంతా ‘స్పిరిట్’ మీదే ఉంది. అది పూర్తయ్యాక కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తాం. వచ్చే ఏడాది ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. ఆ సందర్భంగా కొన్ని సీన్స్ యాడ్ చేసి రీ రిలీజ్ చేయాలన్న ఆలోచన ఉంది. ఇక ‘స్పిరిట్’ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ప్రభాస్ 40 రోజులు వర్క్ చేశారు. మంచి స్క్రిప్టులు వస్తే చిన్న చిత్రాలు తప్పకుండా నిర్మిస్తాం” అన్నారు.






