శ్రీధర్‌రెడ్డి హత్యకేసులో పురోగతి?
నాగర్‌కర్నూల్, మే 26 ( విజయక్రాంతి): వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని లక్ష్మిపల్లిలో ఈ నెల 24న తెల్లవారుజామున బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యకు గురైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును పోలీసులు సీరియస్‌గా చేపడుతున్నట్లు సమాచారం. సంఘటన స్థలంలో క్లూస్ టీం, డ్వాగ్ స్కాడ్స్ సహాయంతో సేకరించిన ఆధారాలతో విచారణ ప్రారంభించి న పోలీసులు మరింత కీలక సమాచారం తెలుసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో మృతుడి ఫోన్ డేటా కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ కాల్స్ డేటా తెప్పించుకున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు తెలు స్తోంది. ఈ క్రమంలోనే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సంఘటన జరిగిన రోజు శ్రీధర్ రెడ్డితో ఓ మహిళా చాలా సేపు మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు ఆ కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం శ్రీధర్‌రెడ్డి రాజకీయ హత్య అని, ఆ కోణంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, శ్రీధర్‌రెడ్డి కుటుంబసభ్యులు స్థానికంగా కొందరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కూడా శ్రీధర్‌రెడ్డి హత్యపై పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే, పోలీసులు మాత్రం ప్రాథమిక విచారణలో లభించిన ఆధారాలకు అనుగుణంగా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో చాలా వరకు పురోగతి సాధించినట్లు విశ్వసనీయ సమాచారం.






