విద్యార్థిని మృతిపై న్యాయ విచారణ జరిపించాలి
భద్రాచలం, మే 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కాలేజీ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై న్యాయ విచారణ జరిపించి, నిజాలను బయట పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం సీతారామరాజు డివిజన్ కమిటీ ఆజాద్ పేరుతో ఆదివారం ఓ లేఖను విడుదల చేశారు. కారుణ్య మరణానికి పూర్తి బాధ్యత కాలేజీ యజమాని డాక్టర్ ఎస్‌ఎల్ కాంతారావుదే అని, భద్రాచలం ఏజెన్సీలో పేదల జీవితాలతో ఆడుకుంటున్న మారుతి నర్సింగ్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మారుతి కాలేజీలో ఇలాంటి ఘటనలు కొత్తకాదని..
గతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అమన్ అనే విద్యార్థిని ఇలాగే చనిపోయిందని, అయితే అనారోగ్య కారణం అంటూ కప్పిపుచ్చారని లేఖలో తెలిపారు. దుమ్ముగూడెం మండలానికి చెందిన జీఎన్‌ఎమ్ చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీ సెలవులకు ఇంటికి వచ్చి మరునాడే ఆత్మహత్య చేసుకుందని, మహబూబాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని ఇదే కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతూ ఇంటికి వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని చనిపోయిందని లేఖలో పేర్కొన్నారు. తాజాగా కారుణ్య కాలేజీ ఆవరణలో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడిందని అన్నారు. ఇలా పరోక్షంగా, ప్రత్యక్షంగా విద్యార్థుల మృతికి కారణం అవుతూ వస్తున్న యజమాని కాంతారావుపై చర్యలు తీసుకోవా లని లేఖలో డిమాండ్ చేశారు.






