13 March, 2026 | 7:37 PM

పదవ తరగతి పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

13-03-2026 05:57 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): పదవ తరగతి వార్షిక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అశ్వాపురం మండల పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. పరీక్షల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు వెల్లడించారు. రేపటి నుండి ఏప్రిల్ 16 వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు.

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని సూచించారు. అలాగే పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను రేపటి నుండి ఏప్రిల్ 16 వరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అశోక్ రెడ్డి హెచ్చరించారు.