7 July, 2026 | 8:59 PM

రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన

07-07-2026 07:55 PM

గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని ముత్తాపురం గ్రామపంచాయితీ తురుబాక గ్రామంలో మంగళవారం గ్రామ ప్రజలు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల కమిటీ ఆధ్వర్యంలో వర్షపు నీటితో బురదమయమైన రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తి రాధ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పూనెం రమణబాబు లు పాల్గొని మాట్లాడుతూ.. దాదాపుగా తూరుబాక  రెవెన్యూ గ్రామంగా గుర్తించి శతాబ్ద కాలం కావస్తున్నా నేటికీ ఆ గ్రామం అభివృద్దిలో ఇంకా వెనుకబడి ఉండడం చాలా బాధాకరమని అన్నారు.

వర్షం పడితే గ్రామంలోని రహదారిపై నడిచే పరిస్థితి లేదని, కనీసం మట్టి రోడ్డు అయినా మంజూరు చేయని పరిస్థితి అని వారు అసహనం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వచ్చి గ్రామాలలో వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి వెళ్లడమే తప్పా మరల తిరిగి చూసిన రోజులు లేవని, వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి విసిగిపోయి ఉన్నారని, కనీసం వర్షాకాలంలో పిల్లలు బడికి వెళ్లాలంటే బురదలో ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. ఈ సమస్యపై ముత్తాపురం గ్రామపంచాయతీ నుండి గుండాల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర, మహాధర్నాను చేపట్టనున్నట్లు, ప్రజలు మహాధర్నాకు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.

గ్రామ రైతు యదలపల్లి వసంతరావు మాట్లాడుతూ..పినపాక శాసనసభ సభ్యులు కాంగ్రెస్ సర్పంచులను గుర్తించి అ యెక్క పంచాయితీలకే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం చాలా బాధాకరమని, ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని, వేరే పార్టీ సర్పంచులు గెలిచిన చోట సవతి ప్రేమ చూపించడం చాలా బాధకరమన్నారు, తన సొంత నియోజకవర్గంలోని ప్రజలను రెండు విధాలుగా చూడడం అనేది చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల కార్యదర్శి గొగ్గెల సుధాకర్, గ్రామ పెద్ద రైతు ఎదలపల్లి కృష్ణ, సనప రాజు, నరసయ్య, జోగా వినోద, వేప కౌసల్య, ప్రమీల, అన్నపూర్ణ, గొగ్గెల ఆదినారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.