ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట: అచ్చంపేటలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో మంగళవారం శ్రీ మహాలక్ష్మి మ్యాక్సీ విజన్ ఈహెచ్‌ఎస్ ఐ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించి తను కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం నుంచి నిర్వహించిన ఈ శిబిరానికి అచ్చంపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, "కంటి చూపు మనిషికి భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరం.
చిన్నచిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ నిరంతరం కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. అర్హులైన వారు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అందిస్తున్న ఉచిత శస్త్రచికిత్సల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని సూచించారు. శిబిరంలో వైద్య నిపుణులు ప్రతి ఒక్కరికీ సమగ్రంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, వైద్య సలహాలు అందించారు. కంటి శుక్లాలు (క్యాటరాక్ట్) ఉన్నట్లు గుర్తించిన రోగులకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులకు శస్త్రచికిత్సలను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు అంగరేకుల బిక్షపతి, ప్రధాన కార్యదర్శి కానోజు మనోహర్ ప్రసాద్ (మన్ను పటేల్) మాట్లాడుతూ, ప్రజలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. శిబిరం విజయవంతానికి సహకరించిన వైద్య బృందానికి, క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ ఉపాధ్యక్షులు కందికొండ శ్రీధర్, కోశాధికారి పోకల ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.






