13 March, 2026 | 5:00 AM

గుండ్లపల్లి స్టేజ్ వద్ద బస్సులు ఆపాలని ధర్నా

13-03-2026 01:00 AM

యాదగిరిగుట్ట, మార్చి 12: యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సులు  ఆపాలని గురువారం యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, పేరబోయిన మహేందర్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట నుండి హైదరాబాదుకు, హైదరాబాదు నుండి యాదగిరిగుట్టకు ప్రతినిత్యం విద్యార్థులు, స్థానికులు ప్రజలు ఎంతోమంది ప్రయాణం చేస్తుంటారన్నారు.

యాదగిరిగుట్ట డిపో ముందు గుండ్లపల్లి గ్రామంలో గతంలో అన్ని ఆర్టీసీ బస్సులు ఆపేవారని ఈమధ్య ఏ ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఆపడం లేదని దీంతో గుండ్లపల్లి లో నివసిస్తున్న విద్యార్థులు స్థానికులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కావున గుండ్లపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సులు అన్నింటిని ఆపాలన్నారు.

బస్సులు ఆపని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. ముందుగా బస్సులు నిలపాలని కోరుతూ ఆర్టీసీ డిపో సీఐకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, ఏఐటియుసి మండల కార్యదర్శి గోపగాని రాజు,8వ వార్డ్ కార్యదర్శి ముక్కెర్ల పెంటయ్య, భగత్ సింగ్ యూత్ అధ్యక్షులు కంబాల వెంకటేష్,కంబాల యాదగిరి,తోటకూరి శ్రీశైలం, శెట్టి నరసింహ,కంబాల శ్రీశైలం,సత్యం,బండ రామచందర్,కంబాల రాజు, సంఘీ అరవింద్,కంబాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.