13 March, 2026 | 2:36 AM

ప్రజల మన్ననలు పొందాలి

13-03-2026 12:58 AM

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, మార్చి 12 (విజయక్రాంతి): ప్రజల మన్ననులు పొందేలా ప్రజాప్రతినిధులు పనులు చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం సూర్యాపేటలో నిర్వహించిన సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహలతో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గురించి అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడాలని తెలిపారు. పాలక వర్గాలు లేక గ్రామాలకు నిధులు రాలేదని, గత నెలన్నర కాలంలో పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయన్నారు. ఈ నెల 31 లోపు మరిన్ని నిధులు విడుదల అవుతాయన్నారు.

ప్రతి గ్రామానికి జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి 60 లక్షల వరకు నిధులు విడుదల అయ్యాయని, ఈ నిధులు ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలన్నారు. పేద ప్రజలకు నిరంతరం మంచి చేసే విధంగా, రాజకీయాలకతీతంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ప్రస్తుతం గెలిచిన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు.

వేసవిలో తాగునీటి సమస్య ఏ గ్రామంలో లేకుండా ఉండే విధంగా అధికారులు, నూతన ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సిసి రోడ్ల, డ్రైయిన్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టడం చాలా కీలకమన్నారు. కాగా తెలంగాణలో ఈ ఖరీఫ్ సీజన్‌లో దేశంలో ఎక్కడ లేని విధంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండినదని, రైతుల నుండి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఒక ఖరీఫ్ పంటకే రైతులకు రూ.20 వేల కోట్లు చెల్లించినామని, కొనుగోలు బోనస్ కింద రూ.40 వేల కోట్లు చెల్లించినామని, ఈ రబీ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయుటకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

దేవాదుల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తుంగతుర్తి నియోజకవర్గానికి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, మందుల సామేల్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జెడ్పీ సిఈఓ శిరీష, డిపిఓ యాదగిరి, సిపిఓ కిషన్, డివైఎస్‌ఓ వెంకట రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పాల్గొన్నారు.

అర్హులకు ఇండ్ల పంపిణీ 

హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల రెండో వారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం మోడల్ హౌసింగ్ కాలనీని ఆయన పరిశీలించారు. మొత్తం 2,160 ఆధునిక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించి అంతే సంఖ్యలో కుటుంబాలకు వసతి కల్పించనున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అత్యంత పేద కుటుంబాలు, గ్రామీణ కూలీలు, రైస్ మిల్ కార్మికులు, హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, సమీప గ్రామాల నివాసితుల కోసం ఉద్దేశించబడిందన్నారు.

లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. మొదటి దశలో కేవలం వెయ్యి మంది లబ్ధిదారులను మాత్రమే ఖరారు చేస్తున్నామని, అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యం ఇచ్చి, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె నరసింహ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఆర్టికల్చర్ పిడి నాగయ్య, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, తహసిల్దార్ కవిత, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు.