25 July, 2026 | 1:13 PM

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన రంగాపూర్ గ్రామస్తులు

25-07-2026 12:41 PM
  1. మూడు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందంటూ ఆవేదన
  2. అచ్చంపేట–శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆందోళన
  3. పోలీసుల జోక్యంతో విరమించిన నిరసన

అచ్చంపేట, జూలై 25: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో అచ్చంపేట–శ్రీశైలం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రామంలో గత మూడు రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆరోపించారు. వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపట్టేలా చూస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.