25 July, 2026 | 12:12 PM

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

25-07-2026 11:37 AM

జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హెచ్చరిక

కోటపల్లి, (విజయక్రాంతి) : ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదనీ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శని వారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల సంయుక్తంగా ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు గుడుంబా తయారీ కేంద్రాలు, గంజాయి నిల్వలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాయి.

గ్రామాల్లో నేరాలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుడుంబా, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువతను నేరాల బాట పట్టించి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా గుడుంబా తయారీ, గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, చట్టాన్ని ధిక్కరించి అక్రమాలకు పాల్పడే వారిపై రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్డన్ సెర్చ్‌లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ సెర్చ్ లో చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, నీల్వాయి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి, చెన్నూరు ఎక్సైజ్ సీఐ హరి, ఎస్సై రమణ, సర్పంచ్ సుఖేందర్, ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.