25 July, 2026 | 1:37 PM

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం..!

25-07-2026 12:35 PM

ప్రతి విద్యార్థి ఉన్నత మార్కులు సాధించాలి:

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ నియోజకవర్గంలోని తెలకపల్లి మండల కేంద్రంలో అంగన్‌వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న పోషకాహారం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన నాణ్యత, ఉపాధ్యాయుల పనితీరు, మౌలిక వసతులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి వారి అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆటలు, చిత్రాలు, విద్యా సామగ్రి ద్వారా చిన్నారుల్లో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందుతున్నదా అనే అంశాన్ని పరిశీలించి, పిల్లల ఆరోగ్య రికార్డులు, బరువు, ఎత్తు నమోదు విధానాన్ని తనిఖీ చేశారు. పోషకాహార లోపాలు కనిపిస్తే వెంటనే వైద్యశాఖతో సమన్వయం చేసి చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదుల నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధన విధానాన్ని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పరీక్షల సన్నద్ధత, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను తెలియజేయాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి పాఠాన్ని ప్రణాళికాబద్ధంగా బోధించాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణతతో పాటు ఉన్నత మార్కులు సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను ఆగస్టు 10లోపు పూర్తిగా పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు ప్రతి స్థాయిలో నాణ్యమైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.