6 July, 2026 | 1:54 AM

ఎల్లమ్మ దేవాలయ స్థలాన్ని కాపాడాలని నిరసన

06-07-2026 12:44 AM

ఆమనగల్లు, జులై 5 (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నవ చైతన్య కాలనీలో గల గ్రామకంఠం భూమిలో, తరాల నుండి దళితులు కొలుస్తున్న రేణుక ఎల్లమ్మ దేవాలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతోందని బాధితులు ఆరోపించారు. స్థలాన్ని కాపాడుకునేందుకు దళిత కుటుంబాలు ఆలయ ప్రాంగణంలో నిరసన చేపట్టాయి. కొల్లూరు కృష్ణా దేవి అనే మహిళ ఉద్దేశపూర్వకంగా 12 మంది దళితులపై అక్రమ కేసులు పెట్టించి ఏడాదిగా ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వం మంచినీటి సర్కారు బావిగా ఉన్న ఈ స్థలాన్ని, ఆలయాన్ని కాపాడుకునేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు.

ఈ నిరసనకు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కావలి శ్రీశైలం, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు లండం జంగయ్య, ఎస్సీ,ఎస్టీ  అట్రాసిటీ కమిటీ సభ్యులు జంతుక శంకర్ మద్దతు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో దళితులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని, ఈ వ్యతిరేక విధానాలను వీడకుంటే దళిత సంఘాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు వస్పుల సురేష్, కొమ్ము శ్రీశైలం, శేఖర్, రమేష్, అప్సర్, కిరణ్, శివ, రాములమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.