7న తరగతుల బహిష్కరణ
ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు
ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సుమారు 14 లక్షల మంది కళాశాల విద్యార్థులు ఫీజుల బకాయిల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజులు చెల్లించే వరకు కొత్త అడ్మిషన్లు నిరాకరిస్తున్నారని ఆరోపించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 7న రాష్ట్రవ్యాప్తంగా తరగతుల బహిష్కరణ చేపట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ఆర్డీవో, ఎంఆర్‌ఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించి వినతిపత్రాలు సమర్పించాలని విద్యార్థులు, ప్రజాసంఘాలకు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు.
సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, సంఘం నాయకుడు సీ. రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల రాందేవ్ మోడీ, నిల్ పటేల్, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.






