04-12-2024 12:48:47 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దాదాపు 1.40 కోట్లకు పైగా జనాభా ఉంది. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ప్రధాన కార్యాలయాలు, అధునాతన సౌకర్యాలున్న దవాఖానలు, ఇతరత్ర కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి.
దీంతో ప్రతీరోజు వేలాది మంది జనాలు వివిధ అవసరాల నిమిత్తం రాజధానికి వస్తుంటారు. పేదలు, నిరుద్యోగులు, అనేక మంది భిక్షాటన చేసుకునే వారు పరిస్థితి మాత్రం దయ నీయంగా తయారైంది. ఇలాంటి వారు ఆశ్రయం కల్పించే ఉద్దేశంతో నైట్ షెల్టర్లకు పక్కా భవనాలను నిర్మించాలని బల్దియా భావిస్తోంది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాల్లో స్థలాలను కేటాయించాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు.
30 సర్కిళ్లకు 18 షెల్టర్లు..
గ్రేటర్ హైదరాబాద్‌లో 6 జోన్ల పరిధిలో 30 సర్కిళ్లు ఉన్నాయి. మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అన్నివైపులా ఆయా ముఖ్యమైన ప్రాంతాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నగరానికి అత్యధికంగా వైద్యం కోసం వచ్చే వారు ఆసుపత్రుల్లో ఉండటానికి అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నీలోఫర్, ఈఎన్‌టీ, ఈఎస్‌ఐ, మానసిక వైద్యశాల, కోఠి మెటర్నరీ దవాఖాన, ఎంఎన్‌జే, బసవతారకం క్యాన్సర్ దవాఖానాలు తదితర అనేక ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ దవాఖానల్లో రోగుల వెంట వచ్చేవారికి ప్రత్యామ్నాయం లేక రోడ్ల వెంటే ఉంటున్నారు. వీళ్లకు రాత్రిపూట షెల్టర్ ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ, మెప్మా ఆధ్వర్యంలో గ్రేటర్‌లో 18 షెల్టర్లను నడుపుతున్నారు.
వీటిల్లో కేవలం 842 మంది ఉండటానికి వసతులున్నాయి. వీటిలో ఉస్మాని యా దవాఖాన, నాంపల్లి ఏరియా దవాఖానల్లో మాత్రమే ప్రభుత్వ భవనాలు షెల్టర్లుగా ఉన్నాయి. మిగతా భవనాలన్నీ ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, అక్కడి దవాఖానల్లో గది లేదా హాల్లో ఈ షెల్టర్లను నిర్వహిస్తున్నారు. షెల్టర్లకు పక్కా భవనాలు లేకపోవడంతో ఎప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందో తెలియనిపరిస్థితి ఉంది.
కలెక్టర్లకు లేఖలు
గ్రేటర్‌లో ప్రస్తుతం 18 షెల్టర్లను ఆయా ఎన్‌జీవో సంస్థలు నిర్వహణ చేస్తున్నాయి. కానీ ఎంజీబీఎస్, సీబీఎస్, జేబీఎస్ ప్రధాన బస్టాండ్లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రధాన బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, నాంపల్లి ప్రధాన రైల్వే స్టేషన్ల సమీపంలో నైట్ షెల్టర్లు లేవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన ఆసుపత్రులతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీపంలో ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తే మెప్మాతో కలిసి పక్కా భవనాలునిర్మించాలనిబల్దియా భావిస్తోంది.