న్యాయ ఖర్చుల లెక్కలు చెప్పండి

16-09-2026 | 05:05am

హెచ్‌సీఏకు టీసీఏ డిమాండ్

సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలన్న గురువారెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) కొన్నేళ్లుగా న్యాయవాదులు, సీనియర్ కౌన్సెల్స్, లీగల్ ఆఫీసర్లు, కోర్టు ఫీజులకు సంబంధించి చేసిన ఖర్చులపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) డిమాండ్ చేసింది.

హెచ్‌సీఏకు అందుతున్న బీసీసీఐ గ్రాంట్లు సహా క్రికెట్ నిధుల్లో ఎంత మొత్తం న్యాయపోరాటాలకు, ఎంత మొత్తం ఆటగాళ్లు, టోర్నమెంట్లు, మైదానాలు, కోచింగ్, జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలకు వెళ్తుందో క్రికెట్ స్టేక్హోల్డర్లకు తెలుసుకునే హక్కు ఉందని టీసీఏ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

న్యాయపరమైన ఖర్చులో ప్రతి రూపాయి చట్టబద్ధమైనదే, అవసరమైనదే, సరైన అనుమతులతోనే ఖర్చయిందని హెచ్‌సీఏకు నమ్మకం ఉంటే, పూర్తి రికార్డును ప్రజల ముందుంచడంలో సంకోచం ఎందుకు? న్యాయవాదులపై ఖర్చయ్యే ప్రతి రూపాయి చివరకు క్రికెట్‌కు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. రూల్స్ 35, 36 సరైన అకౌంట్లు, ఆడిటెడ్ ఆర్థిక నివేదికలను కోరుతుండగా, రూల్ 37 వ్యయాలు, ఆడిటెడ్ అకౌంట్లు, టెండర్లు, కాంట్రాక్టులు, పాలనా రికార్డుల విషయంలో పారదర్శకతను నిర్దేశిస్తుందని గుర్తుచేశారు.

సంవత్సరాలవారీగా న్యాయ వ్యయం ఎంత? ప్రతి అడ్వకేట్ లేదా సీనియర్ కౌన్సెల్‌కు ఎంత చెల్లించారు? హెచ్‌సీఏను రక్షించడానికి చేసిన ఖర్చు ఎంత? వ్యక్తిగత ఆఫీస్ బేరర్లకు సంబంధించిన వ్యవహారాల్లో ఏమైనా హెచ్‌సీఏ నిధులు వినియోగించారా? అని గురువారెడ్డి ప్రశ్నించారు. ఖర్చు చేసిన ప్రతి రూపాయికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని డిమాండ్‌చేశారు. క్రికెట్ అభివృద్ధికి కేటాయించిన నిధులు కేవలం వాటికే ఖర్చు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు