30 June, 2026 | 5:10 PM

సమరానికి సై

05-06-2024 01:04 AM

నేడు ఐర్లాండ్‌తో టీమిండియా అమీతుమీ


అది 2007.. అప్పుడప్పుడే టీ20 ఫార్మాట్ ప్రపంచానికి 

పరిచయం అవుతున్న రోజులవి. వన్డేలు, టెస్టులతో బోర్ 

కొట్టిస్తున్న క్రికెట్‌కు సరికొత్త హంగులు అద్దాలన్న ఆలోచనతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)  టీ20 ప్రపంచకప్ పేరిట కొత్త టోర్నీని తెర మీదకు తీసుకొచ్చింది. సౌతాఫ్రికా వేదికగా 

జరిగిన తొలి ప్రపంచకప్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా టీమిండియా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగింది. అంతకముందు టీ20లు ఆడిన సందర్భాలు కూడా తక్కువే కావడంతో మన జట్టుపై పెద్దగా ఎవరు ఆశలు పెట్టుకోలేదు. పైగా జట్టు మొత్తం యువకులతో నిండి ఉండడంతో సెమీస్‌కు చేరడమే గొప్ప అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ధోనీ సేన లీగ్, నాకౌట్ దాటి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక తుది పోరులో పాకిస్థాన్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా అవతరించింది. 

కట్‌చేస్తే.. ఏళ్లు గడుస్తున్నా టీమిండియా మరోసారి

ప్రపంచకప్ గెలవలేకపోయింది. మధ్యలో 2014లో ఫైనల్ చేరినప్పటికీ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. గత రెండు టీ20 ప్రపంచకప్పుల్లో టీమిండియా ప్రదర్శన అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో 9వ సారి జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ ఆడేందుకు రోహిత్ సేన సిద్ధమైంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ప్రపంచకప్‌లో టీమిండియా.. ఐర్లాండ్‌తో పోరుకు రెడీ అయింది. ప్రస్తుత టీమిండియాలో మూల స్తంభాలైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 

ఈసారైనా టీ20 ప్రపంచకప్‌తో మన వీరులు 

సగర్వంగా స్వదేశానికి తిరిగి రావాలని ఆశిద్దాం..!

న్యూయార్క్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తన వేటను మొదలుపెట్టనుంది. న్యూయార్క్ వేదికగా నేడు ఐర్లాండ్‌తో పోరుకు సిద్ధమైంది. ఇన్నాళ్లు ఐపీఎల్లో ప్రత్యర్థులుగా తలపడిన ఆటగాళ్లు ఒకటిగా జట్టును గెలిపించేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ను త్రుటిలో చేజార్చుకున్న రోహిత్ సేన ఈసారి టీ20 ప్రపంచకప్‌ను ఒడిసి పట్టాలని భావిస్తోంది.  ప్రపంచకప్ ప్రారంభమై రెండు రోజులు కావొస్తున్నప్పటికీ అసలు మజా ఇవాళే ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయంపై కన్నేసింది.

బ్యాటింగ్ దుర్భేద్యంగా..

సహజంగానే మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ విభాగం పేపర్‌పై బలంగా కనిపిస్తోన్నప్పటికీ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తారన్నది ఆసక్తికరం. ఓపెనింగ్ జోడీగా రోహిత్ శర్మ, జైస్వాల్‌లు రానున్నారు. ఈ ఇద్దరు ఐపీఎల్లో అంతంతమాత్రంగానే రాణించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకొచ్చేసరికి ఫామ్‌తో సంబంధం లేదని రోహిత్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశాడు. 2007 నుంచి ప్రతీ ప్రపంచకప్ ఆడిన  రోహిత్‌కు ఐసీసీ టోర్నీల్లో మంచి రికార్డు ఉంది. మరో ఓపెనర్ జైస్వాల్‌కు ఇది తొలి టీ20 ప్రపంచకప్ అయినప్పటికీ తనదైన రోజున సత్తా చాటగలడు.

ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్ కనబరుస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో 765 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు (27 మ్యాచ్‌ల్లో 1141 పరుగులు) చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇక మిడిలార్డర్ సూర్యకుమార్, పంత్, దూబేలతో పటిష్టంగా కనిపిస్తోంది. లోయర్ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు రాణించేందుకు తహతహలాడుతున్నారు. 

బౌలింగ్‌తోనే సమస్య..

బ్యాటింగ్ పరంగా టీమిండియాకు ఎలాంటి ఇబ్బంది లేనప్పటికి బౌలింగ్‌లో మాత్రం కొన్ని సమస్యలున్నాయి.  బుమ్రా, సిరాజ్, అర్షదీప్‌తో పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోం ది. ఇటీవలీ కాలంలో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోన్న బుమ్రా ఐపీఎల్ 17వ సీజన్‌లోనూ 20 వికెట్లు తీశాడు. మరోసారి టీమిండియాకు బౌలింగ్ పరంగా పెద్దన్న పాత్ర పోషించనున్నాడు.