30 June, 2026 | 4:08 PM

నేడు ఛెత్రి చివరి మ్యాచ్

06-06-2024 12:05 AM

కువైట్‌తో భారత్ ఢీ

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భాగంగా నేడు కోల్‌కతా వేదికగా కువైట్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టు ఫిఫా క్వాలిఫయర్స్ మూడో రౌండ్‌కు అర్హత సాధించ నుంది. గ్రూప్ ఉన్న భారత్ 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. అఫ్గానిస్థాన్, కువైట్‌లు చెరో మూడు పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2026లో మెక్సికో, కెనడా, అమెరికా వేదికగా క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్ జరగనుంది.

కాగా సునీల్ ఛెత్రి గత నెలలోనే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛెత్రీ ఆటను చివరిసారి చూసేందుకు ఫుట్‌బాల్ అభిమానులు మ్యాచ్ జరగనున్న సాల్ట్‌లేక్ స్టేడియానికి పోటెత్తనున్నారు. కువైట్‌తో పోరుకు ముందు సునీల్ ఛెత్రి స్పందించాడు. ‘నా కెరీర్‌లో ఇదే చివరి మ్యాచ్ అని చెప్పేందుకు నేను ఇక్కడికి రాలేదు. కువైట్‌తో మ్యాచ్‌లో గెలవడం మాకు చాలా ము ఖ్యం. ఈ పోరులో గెలిస్తే మేము దాదాపు అర్హత సాధించినట్లే.

అందుకే కువైట్‌తో మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకు న్నాం. మ్యాచ్‌లో గెలవడం కష్టమే అయినప్పటికీ సొంత ప్రేక్షకుల సమక్షంలో పూర్తి మద్దతు ఉంటుంది. ఇది మాకు బలం. గెలవడం మా చేతుల్లో ఉండదు. నా రిటైర్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచించను. మ్యాచ్ ఎలా గెలవాలన్న దానిపై మాత్రమే ఫోకస్ పెట్టా. మన జట్టు ప్రపంచకప్‌కు క్వాలిఫై కావడం నా డ్రీమ్ అని పదే పదే వారికి చెబుతున్నా. రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే యోచన లేదు. 19 ఏళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించా. ఇకపై కుర్రాళ్లు ఎలా ఆడతారన్నది దగ్గరి నుంచి పరిశీలిస్తా’ అని అన్నాడు.