3 June, 2026 | 2:29 AM

అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలుగా ప్రజా పాలన

03-06-2026 01:41 AM

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి 

సీఎం రేవంత్ రెడ్డి 

నాయకత్వంలో ప్రజా పాలనలో విప్లవాత్మక మార్పులు 

రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు వి హనుమంతరావు 

కామారెడ్డి, జూన్ 2 (విజయక్రాంతి): అభివృద్ధి, సంక్షేమంతో జోడు గుర్రాలుగా ప్రజా పాలన కొనసాగు తుందని రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు వి హనుమంతరావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ ఆశిష్ సంగు  వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిలతో కలిసి తెలంగాణ అమరవీరులకు అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్ట రేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు.

అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో 9,448 ప్రభుత్వ భవనాల కు శంకుస్థాపన చేపట్టగా 5386 భవనాలకు పైకప్పు ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించగా 4,170 వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో18,445 మందికి 49 కోట్లతో వైద్యం అందించినట్లు తెలిపారు.

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కింద11,616 మంజూరు చేయగా,10,848 ఇండ్లు ప్రారంభమైనట్లు తెలిపారు.226.14 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమ అయినట్లు తెలిపారు. రైతులకు యాసంగి సీజన్ లో4.01 లక్షల టన్నుల ధాన్యం సేకరించి ఇప్పటివరకు రూ.839.48 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. రైతు బీమా కింద 627 నామినీలకు రూ. 31.37 కోట్లు, రైతు భరోసా కింద 3,09,281 మందికి రూ.230 కోట్లు అందించినట్లు తెలిపారు. మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియా సహకారంతో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. దోమకొండకు చెందిన ఇద్దరు విద్యార్థులు విలువిద్య ప్రదర్శనలకు మంత్రముగ్ధుడైన  రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు 50 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. వంశీ ప్రతాప్ గౌడ్ ట్రూప్  విద్యార్థులు నృత్య ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో అలరించాయి.

ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అవార్డులను, పతకాలను అందజేశారు. రెండో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. చిరుత పులి దాడిలో పశువులను కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందజేశారు. అనంతరం సభ ప్రాంగణంలో వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన  స్టాళ్లను రాష్ట్ర  ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు హనుమంతరావు, కలెక్టర్ ఆశిష్ సంగు వాన్, అదనపు కలెక్టర్ లు విక్టర్, గిరి, రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.