27 July, 2026 | 5:15 PM

ప్రభుత్వ కళాశాలలను కాపాడేది ఎవరు?

27-07-2026 04:37 PM

ఇంటర్నల్ మార్కుల వ్యవహారంలో ప్రిన్సిపల్ హస్తం...

అడ్మిషన్ ప్రభుత్వ కళాశాలలో చదివింది ప్రైవేట్ కళాశాల

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పర్యవేక్షణ ఎక్కడ?

చుంచుపల్లి, జూలై 27(విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలను, బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రక్క,ఎన్నో ప్రణాళికలను రూపొందిస్తూ ఉంటే ప్రభుత్వ కాలేజీ యాజమాన్యం అందుకు పూర్తి విరుద్ధంగా నడుచుకుంటుందని  ఆరోపణలు విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

తినేది ప్రభుత్వ కూడు, పాడేది ప్రైవేట్ పాట... అన్న చందాన,

కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఒక ఘటన దీనికి నిదర్శనం. సీమకుర్తి తేజస్వి, సీమకుర్తి ఉషా గీతిక,అనే ఇద్దరు విద్యార్థినులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశం పొంది, స్థానిక కృష్ణవేణి జూనియర్ కళాశాలలో రెండు సంవత్సరాల పాటు,ఎంపీసీ కోర్సు అభ్యసించినట్లు సమాచారం. గత జనవరిలో జరిగిన ఇంగ్లీష్ ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షకు ఈ ఇద్దరు విద్యార్థినులు హాజరయ్యారని, సంబంధిత అధ్యాపకుడు 20 మార్కులకు గాను 18 మార్కులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అనంతరం ఆ మార్కులను కంప్యూటర్‌లో నమోదు చేసి, ఆన్‌లైన్‌లో సమర్పించే ముందు,ప్రింట్ తీసి అధ్యాపకుడి సంతకం పొందిన తర్వాత, మార్కులను 20కు సవరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్పు కళాశాల ప్రిన్సిపాల్ స్థాయిలో జరిగిందని కూడా ప్రచారం సాగుతోంది. కళాశాల ప్రిన్సిపాల్ కత్తి రమేష్, బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు లేకపోలేదు. నిజానిజాలు తేల్చేందుకు ఉన్నతాధికారులు సత్వర విచారణ చేపట్టి, వాస్తవాలను బయటపెట్టాలని విద్యావర్గాలు కోరుతున్నాయి. 

కళాశాల ప్రిన్సిపాల్ కత్తి రమేష్ వివరణ: ఇదే విషయంపై వివరణ కోరగా,పిల్లలు ప్రభుత్వ కళాశాలలో,అడ్మిషన్ తీసుకున్న మాట వాస్తవమే పూర్తి పర్యవేక్షణ,ఆ సెక్షన్ ఇన్చార్జి, లెక్చరర్లదే అని దాట వేశారు.అలాగే ఇంటర్నల్ మార్కుల విషయంలో కూడా లెక్చరర్ల పాత్ర ఉంటుందని,అది ప్రిన్సిపాల్ కి సంబంధం లేదని అన్నారు. కావాలని లెక్చరర్ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని. నేను ఏ విషయం లో నైనా పారదర్శకంగా పనిచేస్తానని,కళాశాలను బాధ్యత యుతంగా ముందుకు తీసుకెళ్తున్నానని అన్నారు.