గ్యారెంటీలు, ఉచితాల పేరిట ప్రజాధనం వృథా
బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
యాదాద్రి భువనగిరి, మే 22 (విజయక్రాంతి) : ఎన్నికల్లో లబ్ధిపొందడానికి గ్యారెం టీలు, ఉచితాల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షు డు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం ఆయన భువనగిరి లో నల్లగొండ పట్టభద్రుల స్థానం ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించారు. మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్లు దోచుకుని చిప్పచేతికిస్తే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఆ చిప్ప పట్టుకుని రూ.16 వేల కోట్లు అప్పు తెచ్చాడని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అక్రమ వసూళ్లకు పాల్పడి ఢిల్లీకి రూ.2వేల కోట్లు కప్పం కట్టాడని ఆరోపించారు. ఈ కారణంగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం, విద్యుత్తు ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదన్నా రు. ఎన్నికల ముందు అందరికి అన్ని ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు కొందరికే అంటూ మోసం చేస్తోందని విమర్శించారు. దేశంలో అసాధ్యంకాని పనులను సుసాధ్యం చేసి చూపిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయనకు సరితూగే వ్యక్తి దేశం లో లేడని కొనియాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతారని, మిగతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే బానిసలుగా ఉండిపోతారన్నారు. సమావేశంలో భువనగి రి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, నాయకులు కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






