మద్యం, మనీపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నమ్మకం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం
బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా
జనగామ, మే 22 (విజయక్రాంతి): గతంలో బీఆర్‌ఎస్ ప్రతీ ఎన్నికల్లో మద్యం, డబ్బులు గుప్పించి నెగ్గేదని, అదే బాటలో ఇప్పుడు కాంగ్రెస్ వెళ్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎవరెన్ని జిత్తులు చేసినా నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం జనగామలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిరుద్యోగ భృతి విషయంలో గత తొమ్మిదేళ్లు కేసీఆర్ మోసం చేస్తే.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా మోసం చేస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు నాలుగు డీఏలు కేంద్రం ఇస్తే రాష్ట్రంలో అమలు చేయలేదని ఆరోపించారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి ఉందని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు కేవీఎల్‌ఎన్‌రెడ్డి, కొంతం శ్రీనివాస్, రమేశ్, హరిశ్చంద్రగుప్తా, సత్యం, సంతోశ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.






