కాంగ్రెస్ గెలుపుతో ఉపయోగం లేదు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
సూర్యాపేట, మే22 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నిరుద్యోగుల సమస్యలు తెలిసిన బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. బీజేపి అభ్యర్థికి మద్దతుగా బుధవారం నల్లగొండలో ప్రచారం నిర్వహించారు.
అరుణ మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ ఏకపక్ష పాలనను ప్రజలు చూశారని, కాంగ్రెస్ మాయ మాటలతో గద్దెనెక్కిన విషయాన్ని గ్రహించారని చెప్పారు. ఇప్పుడు ఓటర్లు విద్యావంతులు కావడంతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించారని, 10కి పైగా స్థానాల్లో గెలువబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ప్రజల తరుఫున మాట్లాడటానికి బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారని, బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే శాసన మండలిలో ప్రజాగొంతుక అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.






