పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కావాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చగా మార్చడమే మన అందరి లక్ష్యం కావాలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ అన్నారు. బుధవారం పట్టణంలోని జనకాపూర్ లోని రైతు వేదికలో మున్సిపల్ ఆధ్వర్యంలో 1, 13, 14, 15 వార్డుల ప్రత్యేక సభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ కేవలం మున్సిపల్ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ఇందులో ప్రతి ఒక్క పౌరుడి భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇండ్లలో ఉత్పత్తయ్యే తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకే అందించాలి తప్ప రోడ్లపై, డ్రైనేజీలలో వేయవద్దని కోరారు. వార్డు సభల ద్వారా ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను, సమస్యలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తున్నామని తెలిపారు.
వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో దోమల నివారణకు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వార్డులలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు. అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వార్డుల వారీగా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వారు రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, కౌన్సిలర్లు వినోద్, కొండు భారతి,విద్యుత్ శాఖ ఏఈ కే లక్ష్మీ రాజం, మున్సిపల్ ఏఈ నవీన్, మున్సిపల్ సిబ్బంది పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.






