calender_icon.png 20 February, 2026 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కింగ్, ట్రాఫిక్ ఏర్పాట్లపై ప్రజల ప్రశంసలు

20-02-2026 12:00:00 AM

  1. బండ్ల ఊరేగింపు, రథోత్సవం ప్రశాంతంగా నిర్వహణ
  2. ఏడుపాయల వన దుర్గ మాత జాతర విజయవంతం
  3. మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

మెదక్, ఫిబ్రవరి 19(విజయ క్రాంతి) : మెదక్ జిల్లా పాపన్న పెట్ మండలం ఏడుపాయలలో మూడు రోజుల పాటు నిర్వహించిన వన దుర్గ మాత జాతరను అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ& భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ముందస్తు ప్రణాళికతో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.

జాతర సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించి నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు వెల్లడించారు. భారీ వాహనాల రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సమర్థవంతంగా నిర్వహించామని చెప్పారు.

జాతర కాలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం వల్ల తప్పిపోయిన పలువురు చిన్నారులను వారి తల్లిదండ్రుల చెంతకు సురక్షితంగా చేర్చగలిగామని అన్నారు.

ఇది అభినందనీయమైన అంశమని పేర్కొన్నారు.బండ్ల ఊరేగింపు, రథోత్సవం వంటి కీలక కార్యక్రమాల సమయంలో కూడా ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసి జాతరను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించడంతో జాతర ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ పేర్కొన్నారు. జాతరకు వచ్చిన ప్రజలు పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ శాఖను అభినందించినట్లు ఎస్పీ తెలిపారు.