7 August, 2026 | 9:31 PM

ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

07-08-2026 08:14 PM

నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ

పోలీస్ అధికారులకు పలు సూచనలు

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ చర్యలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన, శాస్త్రీయ దర్యాప్తు నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ 2.0 లో ప్రతి కేసును సకాలంలో నమోదు చేసి, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి పారదర్శకత, సమాచార సమన్వయం, ప్రజలకు అందించే సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై గ్రామ స్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి రవాణా, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించి, వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు.

గ్రామ స్థాయి పోలీసింగును మరింత బలోపేతం చేస్తూ గ్రామ పోలీస్ అధికారులు ప్రజలతో మమేకమై ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ కేసులు, వారెంట్లు, పిటిషన్ల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల దర్యాప్తులో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి డీఎస్పి సంపత్ రావు,  కాటారం డీఎస్పి సూర్యనారాయణ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.