ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎం. డేవిడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సిర్పూర్ టి మండల కేంద్రంలోని అహ్మద్ నగర్ వాసులు తమ కాలనీకి 3 నెలలుగా త్రాగునీరు రావడం లేదని, నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కెరమెరి మండలం తుమ్ముగూడ గ్రామానికి చెందిన చౌహాన్ అశ్విని తన భర్త మరణించినందున తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం శంకర్ తాను సాగు చేస్తున్న భూమికి పట్టా ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. వాంకిడి మండల కేంద్రానికి చెందిన దుర్గం శ్యామ్ రావు మండలంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం గోలేటికి చెందిన అజ్మీరా రేణుక తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన అజ్మీర అమృతభాయి తనకు వ్యవసాయ రుణం పునరుద్ధరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన నేర్పల్లి పోషం తాను సాగు చేస్తున్న భూమికి పట్టా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
జిల్లా పి వి టి జి సంఘం ప్రతినిధులు తమ దరఖాస్తులో ప్రధాన మంత్రి జన్ మన్ పథకం క్రింద జిల్లాలోని పి వి టి జి లకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. వాంకిడి మండలం పిప్పర్ గొంది గ్రామానికి చెందిన రాథోడ్ గులాబ్ తాను మాజీ నక్సలైట్ అని, లొంగిపోయానని, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.






