13 June, 2026 | 1:53 AM

చెప్పినట్టుగానే దేవస్థాన అభివృద్ధి పనులు ప్రారంభం

13-06-2026 01:01 AM

నియోజక వర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు...

ఎం ఎల్ ఏ ప్రేమ్ సాగర్ రావు 

మంచిర్యాల, జూన్ 12 (విజయక్రాంతి): గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధి ప్రారంభిస్తామని చెప్పిన విధంగానే కేవలం 36 రోజులలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన నెలలోనే శంకుస్థాపన చేసుకోవడం చాలా గర్వకారణమన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచ్చేస్తున్నారన్నారు.

పిప్పిరి సభలో నా అభ్యర్థన మేరకు రూ. 70 కోట్లతో ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారని, అన్నట్టుగానే నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామన్నారు. అదే విధంగా సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాలను మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేస్తారని తెలిపారు.

అలాగే మంచిర్యాల పట్టణంలో ఇంతమంది సింగరేణి కార్మికుల పిల్లలకు నియామక పత్రాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం శ్రీరాంపూర్ సింగరేణి ఓసీని సందర్శిస్తారనీ, తర్వాత మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయ పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.

ఆదివారం పద్మావతి గార్డెన్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సర్ పై బూత్ లెవెల్ ఏజెంట్ లకు అవగాహన, శిక్షణ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.