3 August, 2026 | 6:31 PM

పప్పు పంటలు పెంచాలి

22-06-2024 12:03 AM
  1. అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశం

వ్యవసాయ శాఖ మంత్రులకు సూచన

కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ వీడియో కాన్ఫరెన్స్

తాండూరులో పప్పుదినుసుల బోర్డుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): పెరుగుతున్న అవసరాల దృష్ట్యా  దేశంలో పప్పు దినుసుల సాగును పెంచాల్సి ఉంద ని, అది మనందరి తక్షణ కర్తవ్యమని, దానికి తగ్గట్లు కేంద్ర ప్రభుత్వ విధివిధానాలు ఉంటాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 10 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయశాఖ మం త్రులతో పప్పుదినుసుల సాగు, వాటి విస్తీర్ణాన్ని పెంచే దిశగా చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణలో పండించే తాండూరు కందిపప్పుకు ప్రపంచంలోనే విశిష్ట స్థానం ఉందని, ప్రతి సంవత్సరం నాలుగు లక్షల క్వింటాళ్ల కందిపప్పు అక్కడి నుంచే మార్కెట్‌కు వస్తుందని పేర్కొన్నారు. దీనిని మరింత ప్రోత్సహించేందుకు అక్కడ పప్పుదినుసుల బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పప్పుదిను సుల సేకరణ పరిమితిని వంద శాతానికి పెంచాలని కోరారు.  పప్పు దినుసుల రైతులకు జాతీయ ఆహార భద్రత మిషన్ కింద సబ్సిడీని కూడా పెంచాలని ఆయన అభ్యర్థించారు. తెలంగాణలో ముఖ్యంగా వరి మాగాణిలో మొదటి పంట తర్వాత పప్పుదినుసుల సాగు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్రమంత్రికి వివరించారు.

ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలి

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును సైతం కేంద్ర మంత్రికి తుమ్మల వివరించారు. ఏపీలో 30 సంవత్సరాల నుండి ఇది సాగు లో ఉండగా, తెలంగాణలో మాత్రం 3 సంవత్సరాల నుండి మాత్రమే ఆరంభమైందని, దీంతో ఆయిల్‌పామ్ సాగు చేపట్టే రైతులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని, ముఖ్యంగా ధర గిట్టుబాటు అయ్యే విధంగా చూడాలని కేంద్రానికి  విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ సానుకూలంగా స్పందించినట్లు తుమ్మల చెప్పారు.