పెబ్బేరులో పల్స్ పోలియో చుక్కలు ప్రారంభం
పెబ్బేరు, జూన్ 28: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి (పీహెచ్సీ)లో ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
గతంలో పోలియో వల్ల అనేక మంది చిన్నారులు అంగవైకల్యానికి గురయ్యారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మొదటి రోజు కేంద్రాలకు రాలేని చిన్నారులకు రాబోయే రెండు రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.






