నగరంలో పర్మిట్ రూమ్స్?
- బార్లను తలపిస్తున్న పర్మిట్ రూములు
- గ్రామాల్లో వాడవాడనా బెల్ట్‌షాపులు
- మామూళ్ల మత్తులో ఎక్సయిజ్ శాఖ
కరీంనగర్, జూన్ 28 (విజయక్రాంతి): కరీం‘నగరం’ నడిబొడ్డున యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పర్మిట్ రూంలు బార్ లను మర్పిస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. కేవలం వంద స్కేర్ మీటర్స్‌లో మాత్రమే పర్మిట్ రూం ఉండాలి. కానీ పర్మిట్ రూంలను చూస్తే.. దాదాపు 20 గుంటల నుంచి ఎకరం స్థలంలో నడుస్తున్నాయి.
అది కూడా బాహాటంగా కరీంనగర్ నగరం నడిబొడ్డున నడుస్తున్నాయంటే అక్రమ దందాలకు అధికారుల సహకారం ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. నెలకు 60 లక్షల నుంచి 70 లక్షల మామూళ్ల దందా జరుగుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కోకొల్లలుగా నడుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్‌శాఖ మామూళ్ల మత్తు లో తూగుతున్నది.
ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండేటి రాముపై తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఆయన వద్ద 20,67,850 రూపాయల నగదు లభ్యమైంది. అలాగే ఆయనకు చెందిన ఎస్బిఐ ఖాతాలో 29,88,317, ఆయన తండ్రి శంకర్ యుబీఐ ఖాతాలో 16,77,978 రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. ఈ ఘటనతో ఆబ్కారీ శాఖలో అవినీతి ఎలా రాజ్యమేలుతోంది అర్థం చేసుకోవచ్చు. పర్మిట్‌రూంల పేరిట కొంత మంది వైన్స్ వ్యాపారులు విచ్చలవిడిగా దందాలు చేస్తున్నారు.
వైన్ షాపు ల అద్దెను చెల్లించే బాధ్యత కూడా పర్మిట్ రూంల నిర్వహకులదే. నిజానికి ఫాస్ట్‌ఫుడ్ పర్మిట్ రూంలలో అమ్మరాదు. కానీ అన్నిరకాల నాన్‌వెజ్ విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం వెనుక పెద్ద అవినీతి తతంగమే జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నెలనెలా మామూళ్లు పుచ్చుకొని, అక్రమ దందాలకు అధికారులు సంపూర్ణంగా సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకేంద్రాల్లో పర్మిట్ రూంల పేరిట సాగుతున్న వ్యాపారంపై అధికారులు ఉక్కుపాదం మోపకుంటే మద్యం దుకాణాల ముందు నుండి సాయంత్రం ఆరు దాటిందంటే మహిళలు ప్రయాణించడం కష్టమే.
వాడ వాడనా బెల్ట్ షాపులు...
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కిరాణా షాపులు, బడ్డీ కొట్ల ముసుగులో ప్రతి గ్రామంలో, వీధిలోనూ అక్రమ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వీటికి అధికారిక లైసెన్స్ ఉండదు. సమీపంలోని మద్యం దుకాణాల నుంచి అక్రమం గా మద్యాన్ని తరలించి, అధిక ధరలకు 24 గంటల పాటు విక్రయిస్తుంటారు.
ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తూ ఉండడం పట్ల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి గ్రామాల్లో బెల్ట్ షాపులపై, నగరంలో పర్మిట్ రూములపై ఎక్సయిజ్ అధికారులు కొరడా ఝుళిపించాలని కోరుతున్నారు.






