31 July, 2026 | 3:06 AM

నాణ్యతతో అభివృద్ధి పనులు

31-07-2026 01:55 AM
  1. మౌలిక వసతులు కల్పనే లక్ష్యం
  2. వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తాం
  3. సీసీ రోడ్లు, ఫుట్ పాత్, డ్రైనేజీలు, శ్మశాన వాటికలకు ప్రాధాన్యం 
  4. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు
  5. ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మేడ్చల్/ఉప్పల్, జూలై 30 (విజయక్రాంతి): ప్రజలకు ఆధునిక పట్టణ మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధి పనులు నాణ్యతతో చేపడుతున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో రూ.76 కోట్లతో చేపట్టనున్న వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక వసతులు, ఆధునిక పౌర సేవలు, వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఉప్పల్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత రహదారి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర సౌకర్యాలు మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయన్నారు. అభివృద్ధి పనులను అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, పూర్తి పారదర్శకతతో, నిర్ణీత గడువులో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

రామంతపూర్ బజరంగ్ వ్యాయామశాలకు రూ. 90 లక్షలు మంజూరు కాగా గ్రౌండ్ ఫ్లోర్ విస్తరణ, బోర్ వెల్ ఏర్పాటు, ఆధునిక జిమ్ పరికరాలు ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ భగాయత్‌కు రూ 56.35 కోట్లు విడుదల కాగా ఆ నిధులతో ప్రధాన స్టార్ట్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణం, ఫుట్ పాత్‌ల అభివృద్ధి, మల్టీ స్టోర్స్ అరేనా నిర్మాణం, కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం, వీటి కమాన్ వద్ద బస్ స్టాప్ అభివృద్ధితోపాటు ఇతర వసతులు కల్పనకు మంత్రి శ్రీకారం చుట్టారు.

చిలుకానగర్ బొడ్రాయి వద్ద వివిధ పనులకు రూ.3.23 కోట్లు మంజూరు కాగా మంత్రి శంకుస్థాపన చేశారు. చర్లపల్లి వంపుగూడ కాప్రా ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణం ఇతర పనులకు రూ.15.98 కోట్లు మంజూరు కాగా, ఆ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వినయ్‌కృష్ణారెడ్డి, కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, జోనల్ కమిషనర్ రాధిక గుప్త, కీసర ఆర్డీవో వెంకట్‌రెడ్డి, ఎంఎంసీ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు, ఉప్పల్ డీసీ ఆనంద్, ఈఈ రమేష్‌బాబు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పరమేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.