30 July, 2026 | 6:32 PM

ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం

30-07-2026 05:21 PM

* ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

ఉట్నూర్,(విజయక్రాంతి): విద్యాజ్యోతి సమగ్ర ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్‌లోని స్థానిక బి.ఎడ్. కళాశాలలో నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుల సామర్థ్య పెంపు శిక్షణా కార్యక్రమాన్ని గురువారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి  మంద మకరందు, సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. తరగతి గదిలో విద్యార్థి కేంద్రిత బోధన, సులభమైన మరియు ప్రభావవంతమైన ఆంగ్ల భాషా బోధన పద్ధతులను అవలంబించాలని సూచించారు.

విద్యార్థుల్లో వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం వంటి భాషా నైపుణ్యాలను పెంపొందించే విధంగా బోధన సాగించాలని, ప్రతి విద్యార్థి నేర్చుకునే స్థాయిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంతేకాకుండా, నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధునిక బోధనా విధానాలు, సృజనాత్మక కార్యకలాపాలు, సమర్థవంతమైన తరగతి నిర్వహణ, విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధనా పద్ధతులను అనుసరించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ అధికారి మరియు స్థానిక బి.ఎడ్. కళాశాల ప్రిన్సిపాల్ రాథోడ్ మాణిక్ రావు, సహాయ క్యాంప్ అధికారి  జాదవ్ విఠల్, ఏసీఎంఓ  జగన్, కళాశాల ఉపన్యాసకులు, డి.ఆర్.పి.లు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుండి శిక్షణకు హాజరైన ఆంగ్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.