23 July, 2026 | 3:58 PM

ప్రభుత్వ విద్య మరింత బలోపేతం– ఎమ్మెల్యే జారె

23-07-2026 03:26 PM

దమ్మపేట, జూలై 22(విజయక్రాంతి): దమ్మపేట మండలంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల మండల స్థాయి ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ (Spell–1) కార్యక్రమాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN), సామర్థ్యాధారిత బోధన, విద్యార్థి కేంద్రిత అభ్యాసం, సమర్థవంతమైన తరగతి గది నిర్వహణ వంటి అంశాల్లో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంలో ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

అలాగే దమ్మపేట మండలంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు నాణ్యమైన ఆహారంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో శిక్షణ అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఇలాంటి అనుకూల వాతావరణంలో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు ఉపాధ్యాయులు మరింత ఏకాగ్రతతో నేర్చుకుని, బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి దోహదపడతాయని తెలిపారు. జూలై 21 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న స్పెల్–1 శిక్షణ కార్యక్రమంలో దమ్మపేట మండలానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని ఆధునిక బోధనా పద్ధతులు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN), సామర్థ్యాధారిత బోధన, సమర్థవంతమైన తరగతి గది నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దమ్మపేట మండల విద్యాధికారి (MEO) పి. జగపతి కోర్స్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. మండల రిసోర్స్ పర్సన్స్ (MRPs)గా వి. రాంబాబు (గణితం), జె. ప్రభాకర్ (తెలుగు), వి. షరోని కుమారి (ఇంగ్లీష్), బి. రామ్‌సాగర్ (జనరల్ సబ్జెక్ట్స్) శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.