23 July, 2026 | 4:21 PM

లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జికి పునర్జన్మ

23-07-2026 03:48 PM

వరదలతో దెబ్బతిన్న లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జికి పునర్జన్మ

ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో రూ.4 కోట్ల నిధులు మంజూరు – పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

ఎల్లారెడ్డి జూలై 23 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని  లింగంపేట్ మండలం, లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జి గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. దీంతో స్థానిక ప్రజలు, రైతులు, విద్యార్థులు మరియు వాహనదారులు రాకపోకల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చొరవతో, ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్  నిరంతర కృషి ఫలితంగా, లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.4 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు,మంజూరైన రూ.4 కోట్ల నిధులతో బ్రిడ్జి పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణాన్ని నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం, ఈ బ్రిడ్జి పూర్తయిన అనంతరం లింగంపల్లి ఖుర్ద్ పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థుల ప్రయాణం, అత్యవసర సేవలకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సాయిరాం యాదవ్, మైనార్టీ సెల్ నాయకులు అధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు , నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.