26 March, 2026 | 2:49 AM

పెట్రోల్ బంకుల వద్ద క్యూ!

26-03-2026 12:00 AM

హైదరాబాద్‌లో కిలోమీటర్ల మేర వరుసలో వాహనాలు

పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి

పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు

పెట్రోల్, డిజీల్ దొరకదని వస్తున్న పుకార్లతో జనం బారులు 

డ్రమ్ములు, క్యాన్లలో తీసుకెళ్తున్న వైనం

కొరత లేదంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

హైదరాబాద్/నాగర్‌కర్నూల్, మార్చి 25 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెపుతున్నా జనం వినకుండా ఆందో ళనతో బంకుల వద్ద క్యూ కడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో పెట్రోల్, డిజీల్, సీఎన్‌జీ గ్యాస్ దొరకదనే పుకార్లతో మంగళవారం రాత్రి నుంచి క్యూ కడుతున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతుండటంతో రోడ్ల మీద ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. బుధవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఏ బంకులో చూసిన వందలాది వాహనాలు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి పెట్రోల్, డిజీట్, సీఎన్‌జీ గ్యాస్ కోసం బారులు తీరుతున్నారు. అవసరానికి మించి ఒక్కొక్కరు ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. కొందరైతే క్యాన్‌లు, టిన్ డబ్బాల్లోనూ పెట్రోల్, డీజీల్‌ను ముందస్తు జాగ్రత్తలో భాగంగా నిల్వ చేసుకుంటున్నారు.

హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, చందా నగర్, వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. పెట్రోల్ బంకులు వాహనాలతో కిక్కిరిసిపోగా, క్యూ లైన్లు ప్రధాన రహదారుల వరకు విస్తరించాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వాహనదారులు బంకుల వద్ద బారులు తీరడం గమనార్హం. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, వాహనాల తాకిడి తగ్గకపోవడంతో నియంత్రించడం కష్టమవుతోంది. 

సోషల్ మీడియాలో వదంతులు

అసలు పెట్రోల్ కొరత లేదు. కావాల్సినంత రోజూవారి అవసరాలకు, గతంలో తరహాలోనే ఇప్పుడు కూడా బంకుల్లో పెట్రో ల్, డీజిల్ అందుబుటులో ఉంది. కానీ పె ట్రోల్ దొరకడంలేదని సోషల్ మీడియాల్లో వచ్చే వదంతులు, తప్పుడు ప్రచారం నేపథ్యంలో వాహనదారులు వారం రోజులకు సరిపడా ఒకేసారి తెచ్చుకుంటున్నారు. ఈ వదంతులు రాష్ట్ర వ్యాప్తంగా చేరడంతో పె ట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.

సాధారణ రోజుల కంటే వాహ నదారులు ఒకేసారి బారులు తీరుతుండటంతో బంకుల్లోనూ ఉన్న స్టాక్ అయిపో తోంది. మరోవైపు-- పెట్రోల్ స్టాక్ సరిపడా ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కృ త్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మంగళవారం  పార్ల మెంట్లో యుద్ధ తీవ్రతను ప్రధాని వివరిస్తూ.. కరోనా తరహా సంక్షోభ పరిస్థితి మళ్లీ వచ్చిందని ఆయన అన్నారు. ప్రధాని చెప్పిన గంట కే హైదరాబాద్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం గమనార్హం.-- 

సరిపడా నిల్వలున్నాయి: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్స్

రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అమరేదంర్‌రెడ్డి, ప్రధా న కార్యదర్శి వినోద్ విశ్వనాథ్, కోశాధికారి ఎల్‌వీ కుమార్ ప్రకటనలో తెలిపారు. హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వద్ద అవస రమైన స్టాక్ ఉన్నదన్నారు. వినియోగదారు లు ఎలాంటి వదంతులను నమ్మొద్దని కోరా రు. అన్ని బంకుల్లో సరిపడా నిల్వలున్నాయ ని, సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నదని, ఎటువంటి కొరతలేదని తెలిపారు. 

క్రెడిట్ ఇవ్వకపోవడంతో నో స్టాక్!

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరగడానికి అసలు కారణం పెట్రోల్, డీజిల్ కొరత కాదు. ఆయిల్ కంపెనీలు తమ క్రెడిట్ విధానాన్ని మార్చడమే అసలు కారణంగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రి క్తల నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణ యం తీసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతం లో ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలు, డీలర్ల మధ్య క్రెడిట్ సిస్టమ్ ఉండేది. అంటే కంపెనీలకు డబ్బులు ఇవ్వకున్నా ఇంధనం ట్యాం కర్లు పంపించే వారు.

ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ విధానాన్ని ఆయిల్ కంపెనీలు ఎత్తి వేశాయి. ఇప్పుడు డీలర్లు ముందు గా అడ్వా స్ చెల్లిస్తేనే కంపెనీలు ట్యాంకర్లను అక్కడి నుంచి పంపిస్తాయి. ఈ మార్పు కారణంగానే చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. కోట్ల ల్లో వ్యాపారం కాబట్టి, అడ్వాన్స్‌డ్ డబ్బులు ఉన్న పెట్రోల్ బంక్ ఓనర్లు బుక్ చేసుకొని ట్యాంక ర్లు తెప్పించుకుంటున్నారు. నగదు చెల్లించని బంకుల వద్ద ట్యాంకర్లు రాకపోవడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమి స్తున్నాయి. 

ఇంధన కొరత లేదు: సీపీ సజ్జనార్, కలెక్టర్ హరిచందన

హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, కలెక్టర్ హరిచందన స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం సీపీ, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ నెల 22న కమిషనరేట్ పరిధిలో 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23 నాటికి ఆ సంఖ్య ఏకంగా 6,400 కిలోలీటర్లకు చేరుకుందని సీపీ తెలిపారు.  ప్రజలు ఒక్కసారిగా బంకులకు వచ్చి ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని, దీనిని కొరతగా భావించ వద్దని ఆయన కోరారు.

ఆయిల్ కంపెనీలతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, సరఫరా నిరాటంకంగా కొనసాగు తోందని భరోసా ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే పెట్రోల్ బంకుల యాజమాన్యాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.